Sunday, 1 September 2013

మట్టి వినాయకుడినే పూజించడం ఎందుకు?


గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు. "ఓ మహర్షి! ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి? పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి?"

"మునీంద్రులారా! మంచి ప్రశ్నలు వేశారు. వినండి. పరమేశ్వరుడు విశ్వవ్యాపిత(అంతటా ఉన్నది పరమాత్ముడే) తత్వము కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి, గణపతి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని(అంతటా, అన్నింట అంతర్లీనంగా ఉన్నది గణపతే) ప్రకటించాడు. విశ్వవ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి. దాని నుండి లభించృ పోషక పదార్ధాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి. చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం. ఈ సత్యమును చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూలరూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు(లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రుపాన్ని మట్టితో తయారుచేశాడు). మృత్తికయే పరబ్రహ్మ కనుక, మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది. అంతేకాదు మట్టి ఎక్కడైనా, ఎవరికైనా లభిస్తుంది, దానికి బీదా, ధనిక అనే తారతమ్యం లేదు. సర్వ సమానత్వమునకు ఏకైక తార్కాణం భుమి/మట్టి/వసుధ. బంగారంతో విగ్రహం కొందరే చేయించుకోగలరు. విఘ్నేశ్వరుడు అందరివాడు. అందుకే అందరివాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడు. నేడు సమస్తమానవాళి ఆచరిస్తోంది. సర్వజీవ సమానత్వమునకు ప్రతీక మట్టి వినాయకుడు. అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం, పూజ" అని చెప్పాడు సూతుడు.

మరి పూజానంతరం నీటిలో నిమజ్జనం ఎందుకు? అన్న శౌనకాదుల ప్రశ్నకు సూతుడు ఈ విధంగా సమాధానమిస్తున్నాడు.

వినండి. మట్టితో వినాయకుని చేస్తాం. ఆ విగ్రహానికి మంత్రపూర్వకంగా ప్రాణప్రతిష్ట చేస్తాం. పూజ చేస్తాం. అంతవరకు బాగాబే ఉంది. మామూలు దృష్టితో చూస్తే అది మట్టి బొమ్మే. కానీ ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచిస్తే అది మామూలు మట్టి బొమ్మ కాదు. పరబ్రహ్మ రూపమైన మృత్తికా ప్రతిమ. మనం ప్రాణప్రతిష్ట చేసి ఆహ్వానించి పూజ చేయకపోయినా ఆ ప్రతిమ యందు పరబ్రహ్మ ఉన్నాడు. ఆ మృత్తికలోని అణువణువూ ఆయనే.... అలాంటి మృత్తికను మంత్రపూర్వకంగా పూజించిన తర్వాత ఆ విగ్రహాన్ని అలా వదిలేయడం దోషం. బొమ్మని సృష్టించాం. పూజానైవేధ్యాలతో పోషించాం. మరి లయం చేయవద్దా? లయం చేయడమంటే ఆత్మను విశ్వాత్మతో ఐక్యం చేయడం. అణువును బ్రహ్మాండంలో లీనం చేయడం. అంటే ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడికే చేరుకోవడం. ఇదే సృష్టి, స్థితి, లయల చక్రభ్రమణం. ఇదే పరబ్రహ్మతత్వం. అందుకే పరబ్రహ్మ ప్రతిరూపమైన మట్టి వినాయకుడిని పరబ్రహ్మ స్థూలరూపమైన భూమిలో ఐక్యం చేయడానికి యీ విగ్రహాన్ని సముద్రజలమందుగానీ, నదీ, తటాక జలములయందుగానీ నిమజ్జనం చేస్తే ఆ నీటియందు చేరిన విగ్రహం కరిగి ఆ జలప్రవాహంతో ప్రయానించి, అంటే వ్యాపిస్తూ, పరబ్రహ్మరూపమైన మట్టిలో ఐక్యమైపోతుంది. అందుకే పూజానంతరం వినాయక నిమజ్జనం ఆచారంగా పూర్వులు ప్రకటించారు. ఆచరించారు. పూజలో వినాయకుడికి అర్పించిన పత్రి ఓషధీ గుణాలు కల్గినవీ, భూదేవు ప్రసాదించినవే గనక వాటిని కూడా నిమజ్జనం ద్వారా ఆ పరబ్రహ్మకి అర్పించి అంజలి ఘటిస్తారు. సర్వ ఈశ్వరార్పణం అంటే అసలు అర్ధం ఇదే" అని వివరించాడి సూతమహర్షి.

ఓం గం గణపతయే నమః

No comments:

Post a Comment

Popular Posts